info.manatemples@mail.com

+91 9866933582

ఉంతకల్లు పాండురంగ స్వామి, అనంతపురం జిల్లా

పాండురంగ మహాత్మ్యంలో దుర్వ్యసనాలకు లోనైన వ్యక్తిని పాండురంగడు ఆ అలవాట్ల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అలాగే మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ అలవాటు నుంచి విముక్తి కల్పించే దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వున్నారు. ఆయనే ‘ఉంతకల్లు పాండురంగ స్వామి’. అనంతపురం జిల్లా రాయదుర్గానికి సమీపంలోని బొమ్మనహాల్ అనే ప్రదేశానికి దగ్గర్లోనే ‘ఉంతకల్లు’ శ్రీ పాండురంగ దేవాలయం వుంది.
ఈ ఊరిలోనివారంతా పాండురంగడి భక్తులే. శతాబ్దాల క్రితం ఈ ఊరికి చెందినవారు మహారాష్టల్రోని అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో ‘పండరీపురం’ వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో పాండురంగ దేవాలయాన్ని స్థాపించారు. మద్యానికి బానిస అయినవారు ఈ దేవాలయం ఆవరణలో ‘పాండురంగ మాల’ ధరిస్తే మళ్ళీ జన్మలో మద్యం జోలికి వెళ్ళరన్న నమ్మకం భక్తుల్లో వుంది. ఈ నమ్మకాన్ని రుజువు చేసే తార్కాణాలు కూడా వున్నాయి. అయితే పాండురంగ మాల ఎప్పుడు పడితే అప్పుడు ధరించడానికి వీలు లేదు. ప్రతి నెలలో రెండు రోజులు మాత్రమే మాల ధారణకు అనువైనవి. అవి శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజులు. ఆ రెండు రోజుల్లో పాండురంగ మాల ధరించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఉంతకల్లు గ్రామానికి వస్తూ వుంటారు.


పాండురంగ మాలలను ముందురోజు అర్ధరాత్రి నుంచి ఆలయంలో స్వామివారి సన్నిధిలో వుంచి పూజలు, భజనలు నిర్వహిస్తారు. మాల ధారణ చేయాలని అనుకున్నవారు తెల్లవారుఝామునే స్నానాదికాలు ముగించుకుని, దేవాలయానికి వచ్చి తమకు ఇచ్చిన టోకెన్ నంబర్ ప్రకారం వరుసలో నిలబడాలి. ఆలయ ప్రధాన అర్చకుడు వీరందరికీ పూజ చేసిన పాండురంగ మాలలు మెడలో వేస్తారు. ఆ రెండు రోజుల్లో మాల ధరించడానికి గ్రామానికి వచ్చే భక్తులందరికీ గ్రామస్థులే ఉచిత భోజన వసతి, సౌకర్యాలు కల్పిస్తారు. టోకెన్ కోసం 100 రూపాయలు మినహా మరే ఇతర అవసరానికీ ఇక్కడ డబ్బులు తీసుకోరు. మాల ధారణ చేసినవారు వరుసగా మూడు ఏకాదశి రోజుల్లో ఉంతకల్లు గ్రామానికి వచ్చి నిద్ర చేయాలి. మూడు ఏకాదశులు పూర్తయిన తర్వాత మాల తీసేయాలి. ఇలా ఉంతకల్లులో పాండురంగ మాల ధారణ చేసినవారు మళ్ళీ మద్యం ముట్టుకున్న దాఖలాలు లేవని చెబుతారు.
ఎలావెళ్లాలంటే..?
ముందుగా అనంతపురానికి చేరుకోవాలి. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు, రైళ్లు కలవు. అనంతపురం నుండి 100 కిలోమీటర్ల దూరంలో గల రాయదుర్గం వరకు బస్సులో చేరుకొని, అక్కడి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మనహాళ్ మండల కేంద్రానికి చేరుకోవాలి. రాయదుర్గ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఆటోలో ఎక్కి సమీపాన ఉన్న ఉంటకళ్ (ఉంతకల్లు) పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. బళ్లారి నుండి వచ్చేవారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గం వరకు చేరుకొని, అక్కడి నుండి ఉంటకళ్ దేవాలయానికి వెళ్ళవచ్చు.