info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ రంగనాథస్వామి ఆలయం, తమిళనాడు
రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు. ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి. దక్షిణ భారతదేశంలో పురాతనమైన, ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది. కావేరి నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం, యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది. ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గోపురం ఎత్తు 237 అడుగులు కావడం మరో విశేషం. ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయి. తమిళ నెల మార్గళి (డిసెంబరు నుంచి జనవరి) లో జరిగే 21 రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు. .


#జ్యేష్టాభిషేకం :-
----------------
ఆలయంలో పేరుకుపోయిన మలినాల్ని తొలగించడం కోసం జూన్-జులై మాసంలో ఈ జ్యేష్టాభిషేకం ఉత్సవం చేస్తారు. ఆ రోజున, ఆలయ గర్భగుడిని శుభ్రపరచి ఆలయంలో ప్రత్యేకంగా తయారుచేసిన మూలికా తైలాన్ని పెరియ పెరుమాళ్‌కు పూస్తారు. నామ్‌పెరుమాళ్, అమ్మవార్ల బంగారు తొడుగులను స్వర్ణకారులు మెరుగుపెడతారు. అనేకమంది అర్చకులు, భక్తులు బంగారు, వెండి కలశాల్లో పవిత్ర జలాల్ని తీసుకువచ్చేందుకు కావేరీ నదికి వెళ్ళి, బంగారు కలశాల్ని ఏనుగు మీద తీసుకొస్తారు. ఈ బంగారు కలశాన్ని 1734లో విజయనగర చొక్క నాయకర్ బహూకరించారు. ఆలయంలో ఉన్న వెండి పాత్రల్ని కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి, ఆలయానికి తీసుకొస్తారు. కావేరి నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్ఛారణలు హోరెత్తుతాయి. ఆలయంలో ఉన్న విగ్రహాలన్నిటినీ “తిరువెన్నయలి ప్రాకారం’లో ఉంచుతారు. విగ్రహాలనుంచి బంగారు తొడుగుల్ని తొలగించి, జియ్యర్ స్వామీజీ, వధుల దేశికార్ స్వామిలకు అప్పగిస్తారు. ఆ తరువాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగుపెడతారు. భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు.


#ఉత్సవాలు:
నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తమిళ మాసమైన అని (ఆగస్టు- సెప్టెంబరు) లో పూజాదికాల్లో దోషాలను తొలగించేందుకు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు ఉత్సవ విగ్రహానికి యాగశాలలో 365 సార్లు తిరువర్ధనం జరుపుతారు. రెండో రోజు గర్భగుడిలోని దేవతామూర్తులందరికోసం 1008 సార్లు తిరువర్ధనం జరుపుతారు. ఈ ఉత్సవ సమయంలో భక్తులందరూ పవిత్రమైన నూలు దారాల దండను దేవతామూర్తులకూ అలంకరిస్తారు.
Route Map:-