info.manatemples@mail.com

+91 9866933582

భోగి పండుగ


ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రల తోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు.

భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇండ్లకు వచ్చే కాల సమయం.ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానానంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలికి భోగి మంటలలో పాత పనికిరాని వస్తువులను వేసి పీడలను,అరిష్టాలను తొలగించుకుంటారు.

తెల్లవారకముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది.మనలో ఉన్న బద్దకాన్ని,అశ్రద్ధను,మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద,ఆప్యాయతలతో కూడుకొని ఉన్నజీవితాన్ని ప్రారంభిస్తున్నాము అని ఆత్మారామునికి మాట ఇచ్చి భవగత్ సన్నిదిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది. ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు భోగి పండ్లను పోయడం వలన వారికి ఉన్న బాలారిష్టాలు,ఇతర దోషాలు తొలగి పోతాయి.పిల్లలకు భోగి పండ్లను సాయంకాల సమయంలో పోస్తారు.ఈ భోగి పండ్లలో రేగుపండ్లు,జీడిపండ్లు,కొన్ని చిల్లర నాణేములను,బియ్యం పిండితో చేసి నువ్వుల నూనేలో వేయించిన చిన్ని చిన్న వేపగింజల ఆకారంలో తాల్కలు,చెరుకుగడ ముక్కలను ఈ ఐదింటిని ఒకచోట కలిపి ఇంట్లో ఉన్న పిల్లలో ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన వారికి కొత్త బట్టలు వేసి కూర్చోవడానికి చాప,దుప్పటి లాంటిది వేసి తూర్పు వైపు ముఖం ఉండేలాగ కూర్చో బెట్టి నుదటన కుంకుమ బొట్టు పెట్టి ఇరుగు పోరుగు పిల్లలను పిలిచి భోగి పండ్లను రెండు చేతులతో పిల్లల తలపై నుండి క్రిందకు జారపడే లాగ పోయాలి. ఆ క్రింద పడిన భోగి పండ్లను పిల్లలు సరధా పడుతు,పోటి పడుతూ ఏరుకుని తింటారు.

ఈ సంక్రాంతి భోగి రోజు కొన్ని ప్రాంతలలో ముత్యైదువలు కొత్త గాజులు వేసుకుంటారు.గాజులు తొడిగిన గాజుల వ్యాపారికి వారి పంట పోలాలలో పండిన కొత్త వడ్లను,ధాన్యములను అనవాయితిగా ఇచ్చి సంత్రుప్తిగా సాగనంపుతారు.ఇంటికి వచ్చిన కొత్త అళ్ళులు,కూతుర్లతో సరదాగా ఆనందగా ఉంటారు.ఈ రోజును కుటుబంలో ఎంతగానో ఆనంద ఆప్యాయతల మధ్య అనుభూతులు పొందుతారు.పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులు,ఆత్మీయులతో ఆనందగా గడుపుతారు.
ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా సుమండీ. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు. దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు. సంక్రాంతి పండుగ అనగానే మనకు బాగా గుర్తుకు వచ్చేవి
ముగ్గులు
రధం ముగ్గు
గొబ్బెమ్మలు
బోగిమంట
బోగిపళ్ళు
తిల తర్పణం
సంకురుమయ / సంక్రాంతి పురుషుడు
హరిదాసు
గంగిరెద్దు