info.manatemples@mail.com

+91 9866933582

సంగమేశ్వర స్వామి దేవాలయం- అనిమెల, కడప




చక్కని కొండలు , గల గల పారే నీళ్ళు ,చుట్టూ పచ్చని చెట్ల మద్య లో వెలసిన పురాతన క్షేత్రం సంగామేస్వరాలయం.కడప నుండి సుమారు 50 కి మీ దూరం లో వీరపునాయనిపల్లె మండంలోని అనిమెల గ్రామానికి సమీపంలో సంగమేశ్వర ఆలయం ఉంది.14 వ శతాబ్దం లో నిర్మించినట్లు ఆదారాలు చెబుతున్నాయి . విజయనగర రాజుల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం అందమైన శిల్పకళ కనబడుతుంది .


పాపాఘ్ని, మొగమూరు నదులు సంగమం చెందే చోట వెలసిన ఈశ్వరుడు కనుక ఈ స్వామికి "సంగమేశ్వరుడు" అనే పేరు సార్థకమైంది. సంగమేశ్వర స్వామి వారి ఆలయంలోని లింగమూర్తిని స్వయంగా అగస్త్య మహాముని ప్రతిష్టించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. పూర్వం ఈ ప్రాంతంలో సప్తఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకునేవారు. అలా తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో అగస్త్యమహాముని శివలింగాన్ని ప్రతిష్టించి ప్రతిరోజూ అభిషేకించి అర్చనలు నిర్వహించే వారని స్థలపురాణం చెబుతోంది. దేవాలయం లో శివ ,గణేష్ ,నటరాజ స్వామి ,రామ ,ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి . నిజమైన మూర్తులల కనిపిస్తాయి .


కానీ కలియుగ ప్రవేశంతో పుజాపునస్కారములు లేకుండా పోవడంతో కాలక్రమములో శివలింగం భూమిలో పూడిపోయింది. చాలాకాలం తర్వాత మళ్లీ శివలింగం బయటపడేందుకు మరో కథ ప్రచారంలో ఉంది. సంగమేశ్వర స్వామి వెలసిన ప్రాంతాన్ని పరిపాలించే సూర్యవంశ రాజుగారికి పెద్ద ఆవుల మంద ఉండేది.


ఈ ఆవుల మంద ప్రతిరోజూ సంగమేశ్వర స్వామి వెలసిన అడవీ ప్రాంతంలో మేత మేసి గోశాలకు చేరేవి. కానీ ఒక్క ఆవు మాత్రం గోశాలకు వెళ్లేముందు మందను వదిలి దూరంగా వెళ్లి ఒక పుట్టపై నిలబడి పాలను ధారగా వదిలి అనంతరం గోశాలకు చేరేది. దీన్ని గమనించిన పశువుల కాపరి ఆ గోవును అనుసరించసాగాడు.


పుట్టపై పాలను ధారగా వదిలే ఆవును చూసిన కాపరి చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును కొట్టాడు. ఆ దెబ్బ నుంచి ఆవు తప్పుంచుకోగా, ఆ దెబ్బ పుట్టలోని శివలింగమునకు తగిలింది. ఇంకా రెచ్చిపోయిన కాపరి ఆవును కొట్టడానికి మళ్ళీ గొడ్డలిపైకి ఎత్తడంలో "నేను సంగమేశ్వరుడిని ఈ పుట్టలో ఉన్నాను. ఈ ఆవు ప్రతిరోజు నాకు పాలు ఇస్తూ ఉంది. పుట్టను తొలగించి నన్ను బయటకు తీసి ఆలయం నిర్మించి పూజలు నిర్వహించండి మేలు జరుగుతుంది" అనే మాటలు పుట్ట నుంచి కాపరికి వినిపించాయి.


ఈ విషయాన్ని పశువుల కాపరి రాజుకు తెలపగా పుట్టను తొలగించి, సంగమేశ్వర లింగాన్ని బయటకు తీసి ఆలయం నిర్మించి పూజా పునస్కారాలను ప్రారంభించినట్లు స్థలపురాణం చెబుతోంది. అప్పటి నుంచి ఎత్తైన కొండలు, గలగలా పారేనదులు వంటి సుందర ప్రకృతి దృశ్యాల నడుమ సంగమేశ్వర స్వామి ఆలయం ప్రాచీన కళావైభవానికి, అపురూప ఆధ్యాత్మిక సంపదకు ఆలవాలమై అలరారుతూ ఉంది.
మహాశివరాత్రికి ఇక్కడ ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .